• సమాచార హక్కుపై ప్రజల్లో అవగాహన పెంచాలి.
• చట్టం అమలులో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్
మహబూబాబాద్ /హైదరాబాద్ అక్టోబర్ 9(రైట్స్ మీడియా): సమాచార హక్కు చట్టంతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ప్రజా భాగస్వామ్యంతో సుపరిపాలన సాధ్యమవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్ అన్నారు.
సమాచార హక్కు వారోత్సవాలు–2026లో భాగంగా శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం–2005 జిల్లా స్థాయి వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు.
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో తెలంగాణ సమాచార కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్న సమాచార హక్కు వారోత్సవాలు–2026 రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రధాన సమావేశ మందిరం నుంచి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, డి.ఆర్.ఓ నాగలక్ష్మి, అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ, పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తామని, విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలని సూచించారు.
అక్టోబర్ 5 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని కోరే విధానాన్ని ప్రజలకు వివరించాలని, ప్రజాప్రతినిధులు, పౌరులు, పౌరసమాజ సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు.
చట్టం అమలులో ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీళ్ల అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. తమ విధులు, బాధ్యతలు, చట్టంలో నిర్దేశించిన గడువు, విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించాలని, సెక్షన్ 4(1)(బి) ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అవగాహన పత్రాలు, నోటీసులను స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ప్రదర్శించాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంచడం ద్వారా పాలనపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. సమాచారం కోసం వచ్చే పౌరులకు దరఖాస్తు ప్రక్రియపై తగిన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని రోజువారీ విధుల్లో భాగంగా పాటించాలని, ప్రజలకు సమాచారాన్ని చేరువ చేయడంలో ప్రతి అధికారి తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా సమాచార హక్కు చట్టం (RTI Act, 2005) లోని సెక్షన్ 4(1) ప్రకారం సమాచారాన్ని స్వచ్ఛందంగా తెలిపినందుకు గాను గవర్నర్ గారి చేతుల మీదుగా మహబూబాబాద్ మునిసిపల్ కమీషనర్ బి.వినోద్ కుమార్ ప్రశంసా పత్రం మరియు అవార్డు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ ఓ పవన్ కుమార్, జిల్లా అధికారులు, పిఐఓ లు, అసిస్టెంట్ పిఐఓలు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.