వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తులందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పిలుపునిచ్చారు. ఉత్సవాల నిర్వహణలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు. వినాయక మండపాలను ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు ముందుగా తెలంగాణ పోలీస్ పోర్టల్ ద్వారా ముందస్తు సమాచారం అందించి, సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఇంటిమేషన్ ఫారంలను సబ్మిట్ చేయాలి.
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
పోలీస్ కమిషనర్ వెల్లడించిన కీలక మార్గదర్శకాలు:
1. రహదారులు, కాలిబాటలు మరియు ప్రజలు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మండపాలను ఏర్పాటు చేయరాదు.
2. ప్రతి మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
3. విద్యుత్ శాఖ అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందాలి. షార్ట్ సర్క్యూట్ మరియు అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
4. డిజెలు మరియు అధిక శబ్దంతో కూడిన లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదు.
5. ఇతర మతాల వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పద పాటలు ప్రసారం చేయకూడదు అని సూచించారు.
6. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాల నిమజ్జనానికే ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచించారు.
7. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు. నిర్ధారణ లేని సందేశాలు, వీడియోలను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు.
8. మండపం బాధ్యతలు చూసుకోవడానికి ఎల్లవేళలా ప్రత్యేక వాలంటీర్లు అందుబాటులో ఉండాలి, అలాగే వారి వివరాలను స్థానిక పోలీసు స్టేషన్లో తప్పనిసరిగా అందజేయాలి.
ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే డయల్112 నంబరుకు లేదా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సీపీ కోరారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.