జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులతో పాటు గుడిసెల సర్వేను పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ, డిఆర్డీఓ, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు,
మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల, మున్సిపాలిటీ వారీగా మంజూరైన ఇళ్లు, నిర్మాణాల పురోగతి, పెండింగ్లో పనులు, గుడిసెల సర్వే తదితర అంశాలను సమీక్షించారు.
గుడిసెల సర్వేను పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
జిల్లాకు 4,562 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 851 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ముఖ్యంగా ఆర్సీసీ, రూఫ్ లెవెల్ దశల్లో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
సెప్టెంబర్ 15 నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భూపాలపల్లి మండలంలో అదనంగా 200 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు, భూపాలపల్లి నియోజకవర్గంలో మొత్తం 1,100 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.
నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాని ఇళ్ల విషయంలో నిధుల సమస్య, లబ్ధిదారుల అనాసక్తి, సాంకేతిక లేదా ఇతర కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టంగా నమోదు చేయాలని స్పష్టంచేశారు. లబ్ధిదారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అర్హులైన పేదలందరికీ ఇండ్లు మంజూరుకు ప్రభుత్వ ప్రాధాన్యత మేరకు గుడిసెల సర్వేను పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేలో ఎలాంటి అర్హత కలిగిన కుటుంబం మిగిలిపోకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
భాస్కర్ గడ్డ 2బీహెచ్కే లేఅవుట్లో సీవరేజ్, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, లబ్ధిదారులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ సోమవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి అవసరమైన పూర్తి వివరాలు, నిర్మాణాల పురోగతి, పెండింగ్ అంశాలు, లక్ష్యాల సాధనపై నివేదికలను సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, పీఆర్ ఈఈ విద్యా సాగర్,
శిక్షణా డిప్యూటి కలెక్టర్ నవీన్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు, అన్ని మండలాల ఎంపిడిఓలు, గృహ నిర్మాణ శాఖ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.