-- వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య.
కాళోజీ జయంతిని పురస్కరించుకని హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, తదితరులు.
ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కలం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని, చైతన్య స్ఫూర్తిని కలిగించిన కాళోజీ జీవితం ఆదర్శనీయమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.
కాళోజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్, తదితర ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ...
తెలంగాణ భాషా దినోత్సవాన్ని కాళోజీ జయంతి సందర్భంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులను తన రచనల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువెళ్లి, వారిలో చైతన్యం నింపిన కాళోజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడని అన్నారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో కాళోజీ సాహిత్య స్ఫూర్తి, ఆయన రచనలు ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని నింపాయని అన్నారు. కాళోజీ వరంగల్‌కు చెందిన వారు కావడం గర్వకారణం అని తెలిపారు. ప్రజాకవి కాళోజీ రచనలు, సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, ముఖ్యంగా యువత కాళోజీ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి శుభాకాంక్షలను ప్రజలందరికీ ఎంపీ కడియం కావ్య తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాళోజీ నారాయణ రావు ఆశయాలను కొనసాగిద్దామని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, కోశాధికారి పందిళ్ల అశోక్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఆగపాటి రాజ్ కుమార్, సంయుక్త కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాస రావు, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈ.వి. శ్రీనివాసరావు, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు, పలువురు కవులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.
కాళోజి కళాక్షేత్రంలో..
ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ బాలసముద్రంలోని కాళోజి కళాక్షేత్రంలో కాళోజీ నారాయణ రావు విగ్రహానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కుడా సిపీవో అజిత్ రెడ్డి, ఈఈ బీమ్ రావు, తదితరులు పాల్గొన్నారు.