జయశంకర్ భూపాలపల్లి(రైట్స్ మీడియా): గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శనివారం జిల్లా ఐడిఓసి కార్యాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ
ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టడంతో పాటు గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ఎంపిక చేయాలని సూచించారు. డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధులను కూడా స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేయాలని తెలిపారు. జనాభా ప్రాతిపదికన నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉన్నందున ఆ ప్రాతిపదికన అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో నీరు, విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ తయారు చేయాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు జారీ చేసి కూలీలను పెంచాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతి, విఓ భవనాలు, పాఠశాలలకు ప్రహారి నిర్మాణంతో పాటు అదనపు తరగతి గదులు నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. భూ గర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడు, ఫామ్ పాండ్స్ నిర్మాణం చేపట్టాలని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ
గ్రామాల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత మేరకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అక్టోబర్ 2న నిర్వహించే ప్రత్యేక గ్రామసభల్లో గ్రామాభివృద్ధి పనులపై ప్రజలతో చర్చించి తీర్మానాలు ఆమోదించాలన్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన పనులపై ముందుగానే ఇన్వెంటరీ సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలను పక్కాగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, డిఎంఓ కౌసల్య దేవి, డిపిఓ శ్రీలత ఎంపీడీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.