స్పెషల్ డెస్క్(రైట్స్ మీడియా): తెల్లవారుజామున 4 గంటలు.. నగరం ఇంకా గాఢ నిద్రలోనే ఉంటుంది. కానీ, వారు మాత్రం చీపురు పట్టుకుని రోడ్డెక్కుతారు. మురుగు కాలువలు శుభ్రం చేస్తారు. చెత్తాచెదారం ఎత్తిపోస్తారు. వారి కష్టం వల్లే నగరాలు స్వచ్ఛంగా మెరుస్తున్నాయి. వారే 'సఫాయి కార్మికులు'. స్వచ్ఛ భారత్‌కు వెన్నెముకలా నిలుస్తున్న వీరు మాత్రం ఉదయం పూట ఖాళీ కడుపుతో, ఆకలితో అలమటిస్తూనే విధుల్లో పాల్గొంటున్నారు.
స్వచ్ఛ భారత్‌కు వెన్నెముక.. కానీ ఆకలితో అల్లాడుతున్న సఫాయి(పారిశుద్ధ్య) కార్మికులు!
ఆకలితో పోరాటం.. అనారోగ్యంతో సహవాసం:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లలో వేలాది మంది సఫాయి(పారిశుద్ధ్య) కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు కడుపు మాడ్చుకుని పనిచేస్తారు. మళ్లీ ఇంటికి వెళ్లి వంట చేసుకుని, తిని, మధ్యాహ్నం 2 గంటలకల్లా విధులకు హాజరై సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలి. జాతరలు, ప్రభుత్వ సభలు, సమావేశాలు జరిగినప్పుడు వీరికి అదనపు డ్యూటీలు తప్పవు. అత్యంత పేద వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వీరు.. దుర్వాసన వచ్చే చెత్తను, డ్రైనేజీలను ఖాళీ కడుపుతో శుభ్రం చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్యాల బారిన పడుతున్నారు.
కోట్ల ఆదాయం.. కానీ కార్మికుడికి చాలీచాలని జీతం:
మున్సిపల్ కార్పొరేషన్లకు పన్నులు, పర్మిషన్ల రూపంలో ప్రతి ఏటా వందల కోట్ల ఆదాయం వస్తుంది. స్వచ్ఛ భారత్, అభివృద్ధి పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కానీ, ఆ అభివృద్ధికి, పరిశుభ్రతకు మూలకారణమైన సఫాయి(పారిశుద్ధ్య) కార్మికులకు మాత్రం చాలీచాలని జీతం మాత్రమే అందుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఈ జీతం ఏమాత్రం సరిపోవడం లేదు.
ఉచిత అల్పాహారం, భోజనం ఎందుకు అందించకూడదు?
ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తోంది. పేదల కోసం రూ. 5 కే భోజనం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల వంటి అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్చ భారత్, స్మార్ట్ సిటీ వంటి బృహత్తరమైన కార్యక్రమాలను చేపట్టింది. అలాంటప్పుడు ప్రజారోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న సఫాయి కార్మికులకు ఉచితంగా నాణ్యమైన అల్పాహారం (Breakfast), భోజనం (Lunch) ఎందుకు అందించకూడదు?
సమాజానికి మరియు పాలకవర్గానికి హృదయపూర్వక పిలుపు:
ఇది సంక్షేమ పథకం కాదు.. రాజ్యాంగబద్ధమైన హక్కు (Article 21):
తెల్లవారుజామున 4 గంటలకే నగర పరిశుభ్రత కోసం చేతిలో చీపురు పట్టుకుని, ఖాళీ కడుపుతో మురుగు కాలువల్లోకి దిగే సఫాయి కార్మికుడికి ఉదయాన్నే పౌష్టికాహారం, ఉచిత అల్పాహారం అందించడం పాలకుల దయ లేదా దానం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం మానవ గౌరవంతో, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడం వారి ప్రాథమిక రాజ్యాంగ హక్కు.
శ్రమదోపిడీపై రాజ్యాంగ సమరశంఖం (Article 23):
కనీస ఆహారం, ఆరోగ్య రక్షణ కల్పించకుండా, ఖాళీ కడుపుతో వారిచేత ప్రమాదకర పనులు చేయించుకోవడం తీవ్రమైన శ్రమదోపిడీ. అట్టి అన్యాయానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 23 వారికి చట్టబద్ధమైన రక్షణ కవచంగా నిలుస్తోంది.
మనందరి నైతిక బాధ్యత:
సమాజాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని ధారపోస్తున్న మున్సిపల్ కార్మికుల ఆకలి తీర్చడం కేవలం ప్రభుత్వానిదే కాదు.. పౌరులుగా, సమాజంగా మనందరి నైతిక బాధ్యత! నగరం పరిశుభ్రంగా ఉందంటే అది వారి చెమట చుక్కల ఫలితమే! నగరాల పురస్కారాలు, స్వచ్ఛ ర్యాంకింగ్‌ల వెనుక ఉన్న పారిశుద్ధ్య యోధుల ఆకలి కేకలు మన సామాజిక మనస్సాక్షిని నిలదీస్తున్నాయి. కార్మికుల కడుపు నింపే ఈ 'మహా యజ్ఞంలో' ప్రభుత్వం, యంత్రాంగం మరియు సమాజం భాగస్వామ్యం కావాలి.
రైట్స్ మీడియా సొసైటీ ప్రాతినిధ్యం:
సఫాయి(పారిశుద్ధ్య) కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఉచితంగా నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలని 'రైట్స్ మీడియా సొసైటీ' ఫౌండర్ ప్రెసిడెంట్ తాళ్ళపల్లి తిరుపతి(తిరువార్) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖా మంత్రికి, ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు అధికారికంగా ప్రాతినిధ్య లేఖలను పంపనున్నారు. సమాజ పరిశుభ్రతను కోరుకునే ప్రతి ఒక్కరూ కార్మికుల ఆకలి తీర్చే ఈ మహా యజ్ఞంలో భాగస్వాములు కావాలని రైట్స్ మీడియా కోరుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజారోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న సఫాయి(పారిశుద్ధ్య) కార్మికుల ఆకలి తీర్చేందుకు చొరవ తీసుకుంటాయనే విశ్వాసం వుందని రైట్స్ మీడియా సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ తాళ్ళపల్లి తిరుపతి (తిరువార్) ధీమా వ్యక్తం చేశారు. సఫాయి కార్మికుల ఆకలి పోరాటంలో, వారి రాజ్యాంగ హక్కుల సాధనలో రైట్స్ మీడియా సొసైటీ అధికారిక ప్రాతినిధ్య లేఖలు (Representations), పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) ల ద్వారా అక్షర పోరాటం, చట్టపరమైన పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తుంది.