తెలంగాణ మంత్రి సీతక్క బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలు మహిళా ఎమ్మెల్యేలపట్ల అనుచితంగా ప్రవర్తించారని మంత్రి సీతక్క అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలపట్ల అసభ్యంగా ప్రవర్తించారని మంత్రి సీతక్క ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై సీతక్క తీవ్ర ఆరోపణలు చేశారు. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చారని... అలా చొరబడాల్సిన అవసరం ఏంటని ఆమె ప్రశ్నించారు. కోవా లక్ష్మీ, సబితా ఇంద్రారెడ్డి పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలే అనుచితంగా వ్యవహరించారని తెలిపారు.
నవీన్ రెడ్డి నెట్టుకుంటూ పోయినప్పుడు ఆ మహిళా ఎమ్మెల్యేలు ఇబ్బందిపడ్డారని పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీలను వెనక నుంచి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి తోసేయడంతోపాటు.. నెట్టుకుంటూ ముందుకు వచ్చారని తెలిపారు. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనకు సబంధించిన వీడియోను సీతక్క విడుదల చేశారు.