ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా నెల్లుట్ల బ్రిడ్జి మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎడమ, కుడి వైపులా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.
రహదారులపై ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దాలని, అవసరమైన చోట ప్రీ-కాస్ట్ వాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్లను మరింత వెడల్పుగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్, రోడ్ స్టడ్స్, సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని, వాహనాల వేగ నియంత్రణకు అవసరమైన చోట సైన్ బోర్డులు, బ్లింకర్లు, లైటింగ్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డివైడర్ల వద్ద కూడా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హైగ్రాస్, హైడ్ గ్లాస్ నిబంధనలను అమలు చేయాలని, రోడ్డు భద్రతకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి సత్వర వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. జనగామ, చేర్యాల, పాలకుర్తి ప్రాంతాలతో పాటు ప్రధాన ఆసుపత్రుల వివరాలు, సంబంధిత డాక్టర్ల సమాచారాన్ని సేకరించి పోలీసు, రెవెన్యూ అధికారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇన్సూరెన్స్ సదుపాయం ఉన్నవారితో పాటు లేనివారికి కూడా ప్రమాద సమయంలో అందించే వైద్య చికిత్స ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
పీఎం-రాహత్ (PM-RAHAT) పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందించే అవకాశం ఉందని, ఈ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
పాఠశాల బస్సులు, ఇతర వాహనాల ఫిట్నెస్ పరీక్షలను కఠినంగా నిర్వహించాలని, వాహనాల ఫిట్నెస్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం (హెల్మెట్) ధరించాలన్నారు. ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణించడం (ట్రిపుల్ రైడింగ్) చేయరాదన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేశించారు.
రోడ్డు భద్రతకు సంబంధించి గుర్తించిన పనులన్నింటినీ నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.