GWMC, అక్టోబర్ 26 (రైట్స్ మీడియా): ప్రజల సమస్యల పరిష్కారం లో అలసత్వాన్ని వీడాలని
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు.
సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదుల సంబంధ దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావానికి అనుగుణంగా సంబంధిత విభాగాలకు బదలాయించారు. గ్రీవెన్స్ దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
గత వారం ప్రజావాణిలో స్వీకరించిన వినతుల పరిష్కార స్థితిగతులను కమిషనర్ విభాగాల వారీగా సమీక్షించారు. పెండింగ్లో ఉన్న అంశాలను తక్షణమే పరిష్కరించడంతో పాటు, తీసుకున్న చర్యలను సంబంధిత ఫిర్యాదుదారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అనవసర జాప్యం చోటుచేసుకుంటే సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు అందించే ప్రతి పౌర సేవలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు.