ఖమ్మం జిల్లా ప్రజలకు మరింత సులభతరమైన, సమర్థవంతమైన ఆధార్ సేవలను అందించేందుకు స్థానిక మమత హాస్పిటల్ రోడ్,
కవిరాజ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఖమ్మం ఆధార్ సేవా కేంద్రం (ASK) ను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు.
ఖమ్మం ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
కొత్తగా ప్రారంభించిన ఖమ్మం ఆధార్ సేవా కేంద్రంలో ప్రజలకు సౌకర్యవంతమైన ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అన్ని వయస్సుల వారికి కొత్త ఆధార్ నమోదు, డెమోగ్రాఫిక్ అప్డేట్లు, బయోమెట్రిక్ అప్డేట్లు తదితర సేవలను UIDAI మార్గదర్శకాల ప్రకారం అందించనున్నారు.
కొత్త ఆధార్ నమోదు పూర్తిగా ఉచితమని తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఈ కేంద్రంలో ఆదివారాల్లో కూడా ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. దీనివల్ల ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, ఇతర ప్రజలు తమకు అనుకూలమైన సమయంలో ఆధార్ సేవలను పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
ఖమ్మం ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం జిల్లాలో ఆధార్ సేవల బలోపేతానికి, పౌర కేంద్రిత డిజిటల్ సేవల విస్తరణకు మరో ముఖ్యమైన ముందడుగని మంత్రి అన్నారు. ప్రజలకు అవసరమైన గుర్తింపు సేవలను మరింత అందుబాటులోకి, సమర్థవంతంగా, సౌకర్యవంతంగా అందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, UIDAI హైదరాబాద్ డైరెక్టర్ కె.ఎం. భారతి, అసిస్టెంట్ మేనేజర్ పి. రత్నాకర్, బీఎల్ఎస్ ఆధార్ సేవా కేంద్రం ప్రతినిధులు రీజినల్ మేనేజర్ కె. శ్రీనివాస్ కుమార్, క్లస్టర్ మేనేజర్ దుగ్గి హరినాథ్, ఆపరేషన్స్ మేనేజర్ పి. సురేష్ కుమార్, ఇడిఎం దుర్గాప్రసాద్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.