కూసుమంచి లో నిర్మాణంలో వున్న 100 పడకల ఆసుపత్రి పనులను తనిఖీ చేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం/కూసుమంచి, నవంబర్ -3(రైట్స్ మీడియా):
సంక్షేమ కార్యక్రమాలతో పాటు వైద్య, విద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మంగళవారం మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి, పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం గంగబండ తాండా వద్ద రూ. 45.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒకటో బ్లాక్ స్లాబ్ సెంట్రింగ్, స్టీల్ ఫ్యాబ్రికేషన్ పనులు జరుపుతున్నట్లు, రెండో బ్లాక్ స్లాబ్ వేసినట్లు అధికారులు తెలిపారు. రెండో బ్లాక్ కాలం కాంక్రీట్ పనులు జరుగుతున్నట్లు మంత్రికి వివరించారు. నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
పేదవాళ్ల పిల్లలకు కూడా ఉన్నతమైన విద్యను అందించడంతో పాటు, పేదవాడికి రోగమొస్తే నయం చేసుకునే ఆర్థిక స్థోమత లేని పరిస్థితుల్లో రోడ్డున పడకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అవసరమైన ప్రతిచోటా 100 పడకల ఆసుపత్రులతో పాటు మౌళిక వసతులను ఏర్పాటు చేస్తూ, ఆసుపత్రుల రిక్వైర్మెంట్ బట్టి డాక్టర్లను కూడా కేటాయిస్తున్నామని తెలిపారు.
గతంలో పేదవాడికి జబ్బు చేస్తే "అయ్యో.. ఇంత పెద్ద జబ్బు చేసింది, వైద్యం చేయించుకోవడానికి నా దగ్గర డబ్బు ఏముంది, నాకు చావే గతి" అనే రోజులు ఉండేవని, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి పూర్తి భద్రత, భరోసా కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకునే వారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ధనికులకు ఏ రకమైన వసతులు అందుబాటులో ఉన్నాయో, అదే విధంగా పేదవాళ్లకు కూడా వైద్య, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో సైతం వైద్య రంగానికి కావలసిన పూర్తి మౌళిక వసతులను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
మంత్రి పర్యటన సందర్భంగా డీసీహెచ్ఎస్ డా. రాజశేఖర్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, వైద్య శాఖ ఈఈ టీ. ఉమామహేశ్వర రావు, కూసుమంచి తహసీల్దార్ సైదులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.