GWMC, అక్టోబర్ 8(రైట్స్ మీడియా): నగరంలో రహదారుల వెంట ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, GWMC ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు.
గురువారం GWMC ప్రత్యేకాధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, GWMC కమిషనర్ టి. వెంకన్నతో కలిసి నగరంలోని కల్లుమండువా జంక్షన్, చింతగట్టు, రామారం, కాకతీయ యూనివర్సిటీ రెండవ గేట్, ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో పర్యటించి రహదారుల పరిస్థితి, ట్రాఫిక్, ఆక్రమణలు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.
రహదారికి ఇరువైపులా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఏర్పాటు చేసిన బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు, డబ్బాలు తదితర ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులను ఆదేశించారు.
రహదారుల వెంట ఆక్రమణల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటమే కాకుండా ప్రమాదాలకు అవకాశం ఉన్నందున, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు, వాహనదారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అదేవిధంగా నగరంలోని పారిశుద్ధ్య నిర్వహణను కూడా కలెక్టర్ పరిశీలించారు. రహదారులు, ప్రధాన కూడళ్లు, పరిసర ప్రాంతాల్లో నిత్యం పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.