జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ఆకస్మిక తనిఖీ | పాఠశాలల్లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ(రైట్స్ మీడియా): విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాలను పూర్తిస్థాయిలో అర్థమయ్యేలా ఆసక్తికరమైన బోధనా పద్ధతులను అనుసరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.
మంగళవారం, జిల్లాలోని లింగాల ఘనపురం మండలం, నవాబుపేట గ్రామంలో గల జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించి, పాఠశాలలోని వివిధ తరగతి గదులు, వంటశాల, తాగునీటి సదుపాయం, గ్రంథాలయం, ప్రయోగశాలలు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వంటశాల, తాగునీటి సదుపాయాల పరిశీలన
పాఠశాలలోని తాగునీటి ప్లాంట్‌ను పరిశీలించి, దాని నిర్వహణ, నీటి సరఫరా గురించి ఆరా తీశారు. అనంతరం వంటశాలను తనిఖీ చేసి, మధ్యాహ్న భోజన పథకం కింద వండే పదార్థాలను వంట సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు విద్యార్థులకు అన్నం, సొరకాయ పప్పు వండుతున్నట్లు వంట సిబ్బంది, కలెక్టర్ కు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం తయారు చేస్తున్నారా? వంటకు అవసరమైన గ్యాస్ అందుబాటులో ఉందా? అనే విషయాలను *కలెక్టర్* ఆరా తీశారు. విద్యార్థులకు శుచిరుచికరమైన ఆహారం అందించాలని సూచించారు.
పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు కూర్చొని చదువుకునేందుకు టేబుళ్లు, బెంచీలు, వివిధ రకాల పుస్తకాలు సమకూర్చాలని సూచించారు.
7వ తరగతిలో సైన్స్ బోధనను పరిశీలించిన కలెక్టర్
అనంతరం 7వ తరగతి గదిని సందర్శించి, సైన్స్ పాఠ్యాంశాల బోధనా విధానాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలను విద్యార్థులతో చదివించి, వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు తరగతి గదిలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని, బోధన సమయంలో పూర్తి సమయాన్ని విద్యార్థుల అభ్యసనానికి కేటాయించాలని సూచించారు. విద్యార్థులకు ఆంగ్ల భాషలో బోధన అందిస్తూ, వారి ఆంగ్ల పరిజ్ఞానాన్ని పెంపొందించాలని తెలిపారు.
ఈ సందర్భంగా గాలిలో ఉండే వాయువుల మిశ్రమం, అందులో నైట్రోజన్ శాతం, గది లోపల గాలి పీడనం వంటి అంశాలపై కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నించారు. గదిలో సాధారణంగా ఉండే గాలి పీడనం సుమారు ఒక బార్ ఉంటుందని వివరిస్తూ, గాలి పీడనం, వేగం మధ్య సంబంధాన్ని క్షుణ్ణంగా వివరించారు.
మోటార్ సైకిల్ టైర్ ఉదాహరణతో గాలి పీడనం గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించారు. టైర్లో గాలి పీడనం, బయట వాతావరణ పీడనం మధ్య వ్యత్యాసం, టైర్ పంక్చర్ అయినప్పుడు గాలి బయటకు వచ్చే విధానం వంటి అంశాలను ఉదాహరణలతో *కలెక్టర్, విద్యార్థులకు* సులభ పద్ధతిలో బోధించారు. అలాగే తుఫానులు ఏర్పడటంలో వాతావరణ పీడనానికి ఉన్న ప్రాధాన్యత, గాలి వేగంలో మార్పుల గురించి కూడా వివరించారు.
విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు దైనందిన జీవితంలోని ఉదాహరణలను ఉపయోగిస్తూ, ఆసక్తికరంగా బోధించాలని సూచించారు. కేవలం పాఠ్య పుస్తకంలోని అంశాలకే పరిమితం కాకుండా, వాటిని వాస్తవ జీవిత పరిస్థితులతో అనుసంధానించి బోధించాలని తెలిపారు.
ప్రయోగశాల పరిశీలన - పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ
పాఠశాలలోని ప్రయోగశాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందించేందుకు ల్యాబ్‌లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ల్యాబ్ గదికి వైట్‌వాష్ చేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
10వ తరగతిలో గణిత బోధన – విద్యార్థుల సామర్థ్యాల పర్యవేక్షణ
తదనంతరం 10వ తరగతి గదిని సందర్శించి, గణిత బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షిస్తూ, గణితంలోని వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ముఖ్యంగా గ్రాఫ్‌లకు సంబంధించిన అంశాల్లో విద్యార్థులు మరింత సాధన చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా విద్యార్థులకు గణిత సమస్యను వివరించారు. ఏ, బి, సి, డి పాయింట్లను ఆధారంగా తీసుకొని ఒక సమస్యను వివరిస్తూ, సి పాయింట్ వద్ద ఉన్న ట్యాంక్, డి పాయింట్ వద్ద ఉన్న మహాంజలి ఇల్లు, వాటి మధ్య 50 మీటర్ల దూరం ఉన్నట్లు ఉదాహరణ ఇచ్చారు. ఏ పాయింట్ వద్ద 30 డిగ్రీల కోణం, మరోవైపు 45 డిగ్రీల కోణం ఉన్నప్పుడు బి నుంచి డి వరకు దూరం ఎంత, ఏబీ ఎత్తు ఎంత అనే ప్రశ్నలను విద్యార్థుల ముందుంచారు.
సమస్యను దశల వారీగా విశ్లేషిస్తూ, గణిత సూత్రాలను ఎలా అన్వయించుకోవాలో నిశితంగా వివరించారు. విద్యార్థులు స్వయంగా సమస్యలను పరిష్కరించేలా ప్రోత్సహించారు. గణితంలో కేవలం సూత్రాలను గుర్తుంచుకోవడం కాకుండా, వాటిని సరైన సందర్భంలో ఉపయోగించడం నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అదే విధంగా విద్యార్థులతో గణిత సమస్యలను స్వయంగా పరిష్కరింపజేస్తూ వారి సామర్థ్యాలను పరిశీలించారు.
8వ తరగతి బోధన విధానం పరిశీలన
8వ తరగతి గదిని సందర్శించి, గణిత బోధనా విధానాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను ఏ విధంగా బోధిస్తున్నారు? విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? అనే అంశాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి పాఠ్యాంశాలు అర్థమయ్యేలా చూడాలని సూచించారు.
9వ తరగతిలో తెలుగు బోధన పరిశీలన
9వ తరగతి గదిని సందర్శించి, తెలుగు పాఠ్యాంశాల బోధనను పరిశీలించారు. విద్యార్థుల పఠన సామర్థ్యం, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు. విద్యార్థులను స్వయంగా చదివించి, వారి అభ్యసన స్థాయిని పరిశీలించారు.
పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
పాఠశాల ఆవరణలోని పరిశుభ్రతను పరిశీలించిన కలెక్టర్, పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను తొలగించి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.
అనంతరం గణిత ప్రయోగశాల (మ్యాథ్స్ ల్యాబ్), ఫిజికల్ ఎడ్యుకేషన్ గదిని తనిఖీ చేసి వాటి నిర్వహణ, వినియోగం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పరిశుభ్రమైన వాతావరణం నిర్వహించడం, బోధనలో నూతన పద్ధతులు అనుసరించడం ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.