హైదరాబాద్ (రైట్స్ మీడియా): దక్షిణ భారతదేశాన్ని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల (SRPCC) సమన్వయ కమిటీ సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసింగ్‌లో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను వివరించి నేరరహిత ప్రాంతంగా తీర్చిదిద్దడంలో రాష్ట్రాల మధ్య సమన్వయ అవసరాన్ని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు.
దక్షిణ భారతదేశాన్ని అత్యంత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సమిష్టి కృషితోనే నేరరహిత సమాజం
ఆయా రాష్ట్రాలు తమ సొంత వనరులు, ప్రయత్నాలతో మాత్రమే నేరరహిత రాష్ట్రాలుగా మార్చడం సాధ్యం కాదని, అందుకు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయంతో పనిచేసేందుకు పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఐసీసీసీ (ICCC) వ్యవస్థను సమన్వయం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు.
పోలీసింగ్‌పై వెచ్చించేది ఖర్చు కాదు.. పెట్టుబడి
భద్రత, రక్షణ, నిస్పాక్షికంగా, నైతిక విలువలతో కూడిన సమర్థవంతమైన వ్యవస్థగా పోలీసింగ్ పనిచేయాలని ప్రజలు కోరుకుంటారని సీఎం పేర్కొన్నారు. "పోలీసు వ్యవస్థకు ప్రభుత్వం సమకూర్చే వనరులను ఖర్చుగా భావించకుండా మెరుగైన సమాజ నిర్మాణానికి, పౌరుల భద్రతకు పెట్టే పెట్టుబడిగా నేను భావిస్తాను" అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ మారాలని, పోలీసింగ్‌లో సంస్కరణలు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని చెప్పారు.
సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ ఆదర్శం
మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలను అరికట్టడం, వామపక్ష తీవ్రవాద హింసకు ముగింపు పలకడం వంటి రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి హైదరాబాద్ మహానగరంలో పోలీస్ వ్యవస్థను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లుగా విభజించామన్నారు.
• నేరాల స్వభావానికి అనుగుణంగా హైడ్రా (HYDRAA), ఈగల్ (EAGLE), టీజీ-సేఫ్ (TG-Safe), టీజీ టీమార్స్ (TG-TMARS) వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామన్నారు.
• సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, ప్రగతి (PRAGATI) సమీక్ష సందర్భంగా ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా మార్చినందుకు కేంద్ర హోంమంత్రి తెలంగాణ పోలీసులను అభినందించారన్నారు.
• డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ (EAGLE) సాధించిన పనితీరుకు కేంద్ర ప్రభుత్వం 80 శాతానికి పైగా మార్కులిచ్చిందన్నారు.
• అమెరికాలోని ఎఫ్‌డీఏ (FDA) తరహాలో ఆహార కల్తీని అరికట్టడం, ఔషధాల నియంత్రణ కోసం టీజీ-సేఫ్ (TG-SAFE) ను ప్రారంభించామన్నారు.
• చెరువులు, జలవనరుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ ఆస్తుల భద్రతను కాపాడేందుకు హైడ్రా (HYDRAA) నిరంతరం కృషి చేస్తోందన్నారు.
• హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.
పోలీసు సంక్షేమానికి పెద్దపీట
ప్రజల రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం వివరించారు.
• పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు హైదరాబాద్‌లో 'యంగ్ ఇండియా పోలీస్ స్కూల్' ను ఏర్పాటు చేశామని, హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి సిబ్బంది పిల్లలకు అవకాశం కల్పించామని చెప్పారు.
• విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు కనీసం రూ.1 కోటి నుంచి గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా, అర్హులైన ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం, ఇంటి స్థలం కల్పిస్తున్నామని తెలిపారు.
ఎస్ఆర్పీసీసీ (SRPCC) సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించుకోవడం గర్వకారణమని, రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని సీఎం ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, కర్ణాటక డీజీపీ డాక్టర్ ఎంఏ సలీమ్, తమిళనాడు డీజీపీ డాక్టర్ మహేష్ అగర్వాల్, పుదుచ్చేరి డీజీపీ షాలిని సింగ్, లక్షద్వీప్ ఏడీజీ బి. శంకర్ జైస్వాల్, కేరళ ఐజీ అజీతా బేగం, ఆంధ్రప్రదేశ్ ఐజీపీ రవి కృష్ణ పాల్గొన్నారు. అలాగే తెలంగాణ అధికారులైన సందీప్ శాండిల్య (ఈగల్ డైరెక్టర్), శిఖా గోయల్ (టీజీసీఎస్బీ డైరెక్టర్), అభిలాష బిష్త్ (టీజీపీఏ డైరెక్టర్), మహేష్ భగవత్ (లా అండ్ ఆర్డర్ డీజీ), చారు సిన్హా (సీఐడీ డీజీ), సజ్జనార్ (హైదరాబాద్ పోలీస్ కమిషనర్), అనిల్ కుమార్ (ఆపరేషన్స్ డీజీ) తదితరులు పాల్గొన్నారు.