తెలంగాణ రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధన, వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో హైదరాబాద్‌లో సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులు, మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి తదితర కీలక అంశాలపై ఇరువర్గాలు విస్తృతంగా చర్చించాయి.
తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ: సీఎం రేవంత్‌తో సింగపూర్ ప్రతినిధుల భేటీ
నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్.. నెట్ జీరోగా ఫ్యూచర్ సిటీ:
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా (విజ్ఞాన కేంద్రంగా) తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు తమ ఆఫ్-షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అంగీకరించాయని ఆయన వెల్లడించారు. అలాగే, ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని పూర్తిగా కాలుష్య రహిత (నెట్ జీరో సిటీ) నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.
గాంధీ సరోవర్ వరకు తొలిదశ మూసీ ప్రక్షాళన:
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు వివరాలను సీఎం సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమ ప్రాంతమైన గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలో (రివర్ ఫ్రంట్) ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు, 'నైట్ ఎకానమీ' (రాత్రివేళ ఆర్థిక కార్యకలాపాలు) పెంపొందించేందుకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.
పెట్టుబడులకు పూర్తి సహకారం:
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని, అలాగే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆర్థికపరమైన సహకారం అందించాలని సింగపూర్ బృందాన్ని సీఎం కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సింగపూర్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది డిసెంబర్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రభుత్వం నిర్వహించనున్న 'తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'కు హాజరుకావాల్సిందిగా సింగపూర్ ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, సింగపూర్ ప్రతినిధులైన దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్-జనరల్ విలియం చిక్ తదితరులు పాల్గొన్నారు.