కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్, కేసముద్రం మండల కేంద్రాల్లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు, ఈ సందర్భంగా నిర్వహించిన వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. మాటలతో కాలం గడపడం తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
“వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలు కాలేదు.. ప్రజల కష్టాలు మాత్రం పెరిగాయి,ఇకనైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలి లేదంటే ప్రజల తరఫున బీఆర్ఎస్ మరింత ఉధృతంగా పోరాటం చేస్తుంది” అని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత , మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ మరియు వివిధ మండలాల మాజీ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు సర్పంచులు, బిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
కాంగ్రెస్ పాలనపై భగ్గుమన్న సత్యవతి రాథోడ్
వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?: మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, సత్యవతి రాథోడ్
News URL: https://rightsmedia.in/news/satyavathi-rathod-lashes-out-at-congress-rule