పోలీసు శాఖలో దీర్ఘకాలం పాటు అంకితభావంతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీసు అధికారులను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్ ఘనంగా సన్మానించారు.
ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన అదనపు ఎస్పీ చేతన్ నితిన్
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ…
పోలీసు శాఖలో పనిచేయడం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత అని అన్నారు. ఉద్యోగ జీవితమంతా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన అధికారుల సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనేది సేవలకు ముగింపు మాత్రమేనని, జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. రిటైర్ అవుతున్న అధికారులు తమ అనుభవాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన అధికారులు జమీల్ అహ్మద్ (ఎస్ఐ) , సీహెచ్. శ్రీనివాస్, (ఏఎస్ఐ), ఆర్. కృష్ణ కుమార్,(ఏఎస్ఐ), ఏ. శ్రీనివాస్ (హెడ్ కానిస్టేబుల్), పీ. రాజయ్య (హెడ్ కానిస్టేబుల్) లను అదనపు ఎస్పీ శాలువా కప్పి, జ్ఞాపికలు అందజేసి, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను అభినందించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉద్యోగ కాలంలో అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన అధికారులు మాట్లాడుతూ..
పోలీసు శాఖలో పనిచేసిన ప్రతి రోజు తమ జీవితంలో ఒక మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు. తమ సేవా కాలంలో సహకరించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, సహోద్యోగులు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేసే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా సమాజానికి తమవంతు సేవలు అందిస్తామని అన్నారు.
అనంతరం పదవి విరమణ పొందిన అధికారులను పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్ తో ఘనంగా వీడ్కోలు పలికారు.