జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో, మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు ప్రారంభించారు.
భూపాలపల్లిలో ‘ప్రణామ్' వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ రావు మాట్లాడుతూ
వయోవృద్ధులు సమాజానికి అందించిన సేవలు, వారి అనుభవం ఎంతో విలువైనవని అన్నారు. వృద్ధాప్యంలో వారికి ఆరోగ్య సంరక్షణతో పాటు ఆప్యాయత, భద్రత, గౌరవం, మానసిక ప్రశాంతత అవసరమని తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ డే కేర్ సెంటర్ను మరింత అభివృద్ధి చేసి, వారికి అన్ని విధాలా ఉపయోగపడేలా నిర్వహించాలని సూచించారు.
రెడ్ క్రాస్ భవన నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. అదే భవనంలో వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా ఒక సౌకర్యవంతమైన భవనాన్ని ఏర్పాటు చేయాలని, వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. రెడ్ క్రాస్ సేవా సంస్థకు ప్రత్యేక గుర్తింపుగా రెడ్ క్రాస్ గుర్తు (మార్క్) స్పష్టంగా ఉండేలా భవనాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే, ప్రణమ్ డే కేర్ సెంటర్ను కేవలం భవనంగా కాకుండా వయోవృద్ధులకు నిజమైన సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలని, నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా, పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సూచించారు. వయోవృద్ధులు తమ సమయాన్ని ఆనందంగా గడిపేలా ఆరోగ్యం, వినోదం, పరస్పర స్నేహభావం పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి మాట్లాడుతూ
వయోవృద్ధుల సంక్షేమానికి శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. వృద్ధులు ఒంటరితనానికి గురికాకుండా, ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ సమయాన్ని గడిపేలా డే కేర్ సెంటర్ ఉపయోగపడుతుందని అన్నారు. వయోవృద్ధుల ఆరోగ్యం, సంక్షేమం, భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ
వయోవృద్ధుల కోసం ఇలాంటి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వృద్ధులను గౌరవించడం, వారి అవసరాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కేంద్రం అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని అన్నారు.
రెడ్ క్రాస్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ
వయోవృద్ధుల సేవే నిజమైన మానవ సేవ అని అన్నారు. వారి ఆరోగ్యం, ఆనందం, మానసిక ఉల్లాసం కోసం ‘ప్రణమ్’ డే కేర్ సెంటర్ను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. వయోవృద్ధులకు అవసరమైన సేవలను నిరంతరం అందిస్తూ, కేంద్రాన్ని సక్రమంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం అతిథులు డే కేర్ సెంటర్లోని సదుపాయాలను పరిశీలించి, వయోవృద్ధులతో ముచ్చటించారు. వారి అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.