వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామ శివారులోని సర్వే నెం.40 లో అక్రమ లేఔట్ కు వర్ధన్నపేట ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి 3 నోటీసులు ఇచ్చి నెలలు గడుస్తున్న వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సర్వే నెం.40 లో ఎకరాల కొద్దీ భూమిని ప్లాట్లుగా విభజించి కాంపౌండ్ వాల్, ఇనుప గేటు ఏర్పాటు చేశారు.
ఇదే విషయాన్ని గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా కేవలం నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 53 ప్రకారం అక్రమ లేఔట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ కార్యదర్శి, ఎంపీఓ నిర్లక్ష్యం వల్ల పేదలు లక్షలు పెట్టి, ప్లాట్లు కొని మోసపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీని వెనక ఏదైనా మతలబు ఉందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్, డీపీవో వెంటనే స్పందించి సర్వే నెం.40 లోని అక్రమ లేఔట్ పై విచారణ చేసి కూల్చివేయించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.