మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు.
ఆదివారం హనుమకొండ గోపాల్ పూర్ జవహర్ కాలనీలో ఐఐఎంఆర్ న్యూట్రి హబ్ ప్రోత్సాహంతో ఉజ్వల చంద్రగిరి అనే యువతి ఎంటర్ప్రెన్యూషిప్ లో భాగంగా నెలకొల్పిన అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీరు మాన్యూప్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఉత్పత్తి యూనిట్ కు సంబంధించిన వివరాలను ఎంటర్ప్రెన్యూరర్ ఉజ్వలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హనుమకొండలో దేశంలోనే తొలిసారిగా ప్లాంట్ బేస్డ్ మిల్లెట్ పన్నీర్ తయారీ యూనిట్ ఇది అని, ఈ యూనిట్లో పాల ఉత్పత్తులతో కాకుండా మొక్కల నుంచి లభించే ప్రోటీన్‌ను ఉపయోగించి నాన్-డెయిరీ మిల్లెట్ పన్నీర్, మిల్లెట్ బాసుంది తయారు చేస్తామని తెలిపారు. ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన ప్రత్యామ్నాయ ఆహార ఉత్పత్తుల తయారీకి ఈ యూనిట్ దోహదపడుతుందన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR) ఆర్కేవీవై రాఫ్తార్ కార్యక్రమం ద్వారా స్థాపించినట్లు పరిశ్రమ నిర్వాహకురాలు ఉజ్వల కలెక్టర్ కు వివరించారు.