తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అర్హులైన రోగులు ‘డాక్టర్ అంబేడ్కర్ మెడికల్ ఎయిడ్ స్కీమ్’ కింద అందించే వైద్య సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కోరారు. శుక్రవారం కలెక్టర్ ఒక ప్రకటనలో పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
తీవ్రమైన వ్యాధులతో బాధపడుతూ ప్రత్యేక వైద్య చికిత్స, శస్త్రచికిత్స అవసరమైన ఎస్సీ, ఎస్టీ వర్గాల రోగులకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకూడదని తెలిపారు. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, మూత్రపిండ వ్యాధులకు డయాలసిస్, క్యాన్సర్కు కీమోథెరపీ, రేడియోథెరపీ, మెదడు సంబంధిత శస్త్రచికిత్సలు, మూత్రపిండాలు, కాలేయం తదితర అవయవాల మార్పిడి, వెన్నెముక శస్త్రచికిత్సలతోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందవచ్చని పేర్కొన్నారు.
ఆసుపత్రి ధ్రువీకరించిన అంచనా చికిత్స వ్యయంలో నిబంధనల మేరకు వందశాతం సహాయాన్ని, ఆయా చికిత్సలకు నిర్దేశించిన గరిష్ఠ పరిమితికి లోబడి మంజూరు చేస్తారని పేర్కొన్నారు. మంజూరైన మొత్తాన్ని రోగికి నగదు రూపంలో అందించకుండా, చికిత్స నిర్వహించే ఆసుపత్రి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారని తెలిపారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం గుర్తింపు పొందిన ఆసుపత్రులతోపాటు డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అర్హులైన రోగులు డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ నిర్దేశించిన నమూనాలోని దరఖాస్తు పత్రాన్ని వినియోగించాలని, అవసరమైతే అదే నమూనాలో సాధారణ కాగితంపై దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రోగి ఫొటోతోపాటు సంబంధిత ఆసుపత్రి వైద్య పర్యవేక్షకుడు ధ్రువీకరించిన చికిత్స అంచనా వ్యయం, ప్రతిపాదిత చికిత్స, శస్త్రచికిత్స తేదీ వివరాలను జతచేయాలని తెలిపారు.
మూత్రపిండాలు, ఇతర అవయవాల మార్పిడి చికిత్స కోసం దరఖాస్తు చేసుకునేవారు అవయవ దాత వివరాలతోపాటు రోగికి, దాతకు మధ్య ఉన్న బంధుత్వాన్ని నిర్ధారించే ధ్రువపత్రాలను కూడా సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తిచేసిన దరఖాస్తును ప్రతిపాదిత శస్త్రచికిత్స, డయాలసిస్, కీమోథెరపీ, ఇతర చికిత్స తేదీకి కనీసం 15 రోజుల ముందుగా దరఖాస్తులను డైరెక్టర్, డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్, 15, జన్పథ్, న్యూఢిల్లీ–110001 చిరునామాకు పంపించాలని తెలిపారు.
పథకం మార్గదర్శకాలు, దరఖాస్తు నమూనా, ఇతర పూర్తి వివరాల కోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ అధికారిక వెబ్సైట్ dosje.gov.inను సందర్శించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ రోగులకు ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అర్హులైన రోగులు అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకొని వైద్య సహాయం పొందాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.