హనుమకొండ(రైట్స్ మీడియా): తెలుగు భాష అభివృద్ధి, పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సాంకేతిక యుగంలో పుస్తక పఠనానికి దూరమవుతున్న విద్యార్థుల్లో చదివే అలవాటును పెంపొందించాల్సిన అవసరం ఉందని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ కళాశాల సెమినార్ హాల్లో మంగళవారం ఉదయం తెలుగు విభాగం, మడికొండ స్పందన కళానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు విభాగ విశ్రాంత సహాయ ఆచార్యులు డాక్టర్ పెద్ది వెంకటయ్య రచించిన శబ్ద వాహిని (నానీలు) సాహితీ చంద్రిక (వ్యాస సంపుటి) అంబేద్కర్ మళ్లీ పుట్టాడు (నాటిక)’ గ్రంథాల ఆవిష్కరణ–అంకితోత్సవం నిర్వహించారు. తెలుగు విభాగ పాఠ్య ప్రణాళిక అధ్యక్షులు, పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్రా రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలుగు భాష గొప్పతనాన్ని, సాహిత్య ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రస్తుత సాంకేతిక యుగంలో విద్యార్థులు పుస్తక పఠనానికి దూరమవుతున్నారని అన్నారు. ఇలాంటి పుస్తకావిష్కరణ కార్యక్రమాలు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు సాహిత్యం పట్ల స్ఫూర్తిని కలిగిస్తాయని పేర్కొన్నారు. తెలుగు భాషను పరిరక్షించడంతో పాటు మరిన్ని నూతన సాహిత్య ఆవిష్కరణలు జరగాలని ఆకాంక్షించారు.
రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం మాట్లాడుతూ, తెలుగు భాషను బతికించుకోవడంతో పాటు భావితరాలకు దాని వైభవాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలుగు భాషా సాహిత్య అభివృద్ధికి రచయితలు, సాహితీవేత్తలు, విద్యార్థులు మరింతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శబ్ద వాహిని (నానీలు) గ్రంథాన్ని తెలుగు విభాగ విశ్రాంత ఆచార్యులు ఆచార్య పాకనాటి జ్యోతికి, ‘సాహితీ చంద్రిక (వ్యాస సంపుటి)’ గ్రంథాన్ని దివంగత తెలుగు విభాగ విశ్రాంత ఆచార్యులు ఆచార్య పేర్వారం జగన్నాథంకు వారి తరఫున కుమారులు పేర్వారం శంకర్రావు, పేర్వారం శ్రీనాథ్‌లకు, అంబేద్కర్ మళ్లీ పుట్టాడు. గ్రంథాన్ని డాక్టర్ చిర్రా రాజుకు అంకితం చేశారు.
కార్యక్రమంలో గ్రంధ రచయత డాక్టర్ పెద్ది వెంకటయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, కాళోజీ పురస్కార గ్రహీత వి.ఆర్. విద్యార్థి, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. నరసింహ చారి, తెలుగు విభాగాధిపతి డాక్టర్ ఎం. లింగయ్య, విశ్రాంత ఆచార్యులు జి. కిషన్ ప్రసాద్, డాక్టర్ వాసిరెడ్డి కృష్ణారావు, డాక్టర్ పొరెడ్డి రంగయ్య, డాక్టర్ కర్రే సదాశివ, డాక్టర్ రాజ్‌కుమార్, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ బి. స్వామి నాయక్, ఆచార్య వరలక్ష్మి, ఆచార్య అమరావేణి తదితరులు పాల్గొన్నారు.