మానవ అక్రమ రవాణాకు గురై నేపాల్ నుంచి కేరళకు తరలించబడుతున్న ఓ 14 ఏళ్ల మైనర్ బాలికను అధికారులు విజయవంతంగా రెస్క్యూ చేశారు. అనంతరం ఆ బాలికను తిరిగి ఆమె స్వదేశానికి పంపేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సమక్షంలో అధికారికంగా అప్పగించారు.
మానవ అక్రమ రవాణాకు గురైన నేపాల్ బాలిక రెస్క్యూ
వివరాల్లోకి వెళితే..
సెప్టెంబర్ 11 (11-09-2026)న ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ (AVA) ఎన్జీవో ఇచ్చిన సమాచారం మేరకు, నేపాల్‌కు చెందిన ఒక మైనర్ బాలికను ఇద్దరు మహిళలు అక్రమంగా రప్తి సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో కేరళలోని కొల్లం వైపు తీసుకువెళుతున్నారనే విషయం స్థానిక ఏఐడీ (AID) ఎన్జీవోకు తెలిసింది. వారు వెంటనే ఈ విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగ అధికారిణికి తెలియజేశారు.
వెంటనే స్పందించిన అధికారులు..
రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్, జీఆర్పీ (GRP) మరియు ఆర్పీఎఫ్ (RPF) అధికారుల సమన్వయంతో రైలులో ఆ మైనర్ బాలికను, ఇద్దరు మహిళలను రెస్క్యూ చేశారు.
అనంతరం మైనర్ బాలికను ఖమ్మం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు హాజరుపరచగా, వారి ఆదేశాల మేరకు బాలికను బాలల సదనంలో ఉంచారు. సదరు ఇద్దరు మహిళలపై జీఆర్పీ పోలీసులు మానవ అక్రమ రవాణా చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
బాలిక కుటుంబ స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశించగా.. నేపాల్‌కు చెందిన 'మైటీ నేపాల్' అనే స్వచ్ఛంద సంస్థ ఆ వివరాలను పంపించింది. పాప తల్లిదండ్రులిద్దరూ అంధులు కావడం వలన వారు ఇండియాకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో మైటీ నేపాల్ సంస్థ ప్రతినిధి.. నేపాల్ ఎంబసీ ఇండియా కార్యాలయం అనుమతితో సెప్టెంబర్ 21 (21-09-2026)న ఖమ్మం వచ్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు తగిన ఆధారాలు, పత్రాలను సమర్పించారు.
అన్ని పత్రాలను పరిశీలించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ.. పాపను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సమక్షంలో అప్పగించడం జరిగింది.
ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణాకి గురైన బాధితులకు ప్రభుత్వపరంగా ఇచ్చే రూ. 20 వేల నగదును కలెక్టర్ చేతుల మీదుగా పాపకు అందజేశారు. ఈ నగదును బాలిక పునరావాసానికి, కుటుంబంలో తిరిగి మమేకం అవ్వడానికి ఉపయోగిస్తూ, చక్కని సంరక్షణలో పాపను ప్రయోజకురాలిని చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
ఈ బాలికను అప్పగించే ప్రక్రియ మొత్తాన్ని జిల్లా బాలల పరిరక్షణ అధికారిణి విష్ణువందన సమన్వయం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు లింగయ్య, లక్ష్మణ్, ఏఐడీ సంస్థ డైరెక్టర్ పి.ఎస్.ఎస్. హరి ప్రసాదరావు, మైటీ నేపాల్ సంస్థ ప్రతినిధి మహేశ్వరి, బాలల సదనం సూపరింటెండెంట్ నవ్య, లీగల్ ప్రొబేషనరీ ఆఫీసర్ శ్రీలక్ష్మి, ఏఐడీ సంస్థ జిల్లా కోఆర్డినేటర్లు కే. శ్రీనివాస్, రాజేష్, అసోసియేషన్ ఫర్ వాలంటీర్ యాక్ఆషన్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.