హైదరాబాద్ (రైట్స్ మీడియా): బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా నిర్వహించే స్ట్రీట్ వెండర్స్ కి సంబంధించిన ఎగ్స్ షాప్ను కూడా ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.1.20 కోట్ల రూపాయల సున్నా వడ్డీ రుణాల చెక్కును అందించారు. అలాగే ముషీరాబాద్ లోని బాగ్ లింగంపల్లి వార్డ్ 163 వద్ద రూ.1.5 కోట్ల అంచనా వ్యయంతో SWD డ్రెయిన్, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ క్యాంటీన్లను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ కష్టపడి పనిచేసుకుంటూ జీవనం సాగించే పేద, సామాన్య ప్రజలకు కేవలం రూ.5కే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం మహిళలకు ఆర్థిక వృద్ధి సాధించడానికి వారి చేత ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ఏర్పాటు చేస్తుందని, ప్రభుత్వం తరఫున అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ శాశ్వత నిర్మాణాలతో, అన్ని సౌకర్యాలతో క్యాంటీన్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నదే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు కూడా పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరాలని కోరారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు గతంలో రూ.5 లక్షల వరకు అందించిన వడ్డీలేని రుణ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచిందని, గత మూడు సంవత్సరాలుగా వడ్డీలేని రుణాలపై వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు.
మహిళా సంఘాల ద్వారా ఇందిరమ్మ క్యాంటీన్లు నిర్వహించడంతో పాటు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను కూడా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ఇప్పటికే 600 బస్సులకు మహిళలను యజమానులను చేసిందని గుర్తుచేశారు. పట్టణ ప్రాంతాల్లోనూ మహిళా సంఘాలకు ఈ అవకాశాలను విస్తరించాలనే ఆలోచన ఉందన్నారు.
హైదరాబాద్ నగరంలోని మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించేందుకు అర్హత ఉన్న సంఘాలను గుర్తించి, 100 శాతం రీపేమెంట్ సామర్థ్యం ఉన్న మహిళా సంఘాలకు అవకాశం కల్పించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ని కోరినట్లు తెలిపారు.
అదేవిధంగా బీసీ, మైనారిటీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కుట్టు మిషన్లను అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపడుతోందని, ప్రతి నియోజకవర్గంలో మహిళలకు కుట్టు మిషన్లతో పాటు అవసరమైన శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంచి సాంకేతికత కలిగిన నాణ్యమైన కుట్టు మిషన్లను అందించేలా నిర్ణయం తీసుకున్నామని, అర్హత ఉన్న మహిళలు సెప్టెంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
మహిళలు కేవలం కుటుంబానికి పరిమితం కాకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని, కుటుంబాన్ని ఆర్థికంగా నడిపించే శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మహిళలకు రావాలని పిలుపునిచ్చారు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సాధికారతకు, తద్వారా సమాజ అభివృద్ధికి పునాది అని, అందుకే మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వారికి వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు, శిక్షణ, కుట్టు మిషన్లు, క్యాంటీన్లు, బస్సులు వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. తెలంగాణలోని ప్రతి అక్కచెల్లెమ్మ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని, స్వయం సమృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.