వైద్య, సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలందిస్తూ, అందాల పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన విశాఖపట్నానికి చెందిన ప్రముఖ అనస్థీషియా వైద్యురాలు డాక్టర్ ఎం. సృజనా దేవి ‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా-2025’ టైటిల్‌ను కైవసం చేసుకోవడం పట్ల మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు
ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా-2025 విజేత డాక్టర్ సృజనా దేవికి మంత్రి దుర్గేష్ అభినందనలు
వైద్య, సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలందిస్తూ, అందాల పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన విశాఖపట్నానికి చెందిన ప్రముఖ అనస్థీషియా వైద్యురాలు డాక్టర్ ఎం. సృజనా దేవి ‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా-2025’ టైటిల్‌ను కైవసం చేసుకోవడం పట్ల మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ‘ఫరెవర్ స్టార్ ఇండియా’ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి అందాల పోటీల తుది ఘట్టంలో దేశవ్యాప్తంగా పాల్గొన్న వేలాది మంది పోటీదారులను అధిగమించి డాక్టర్ సృజనా దేవి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకోవడం గొప్ప విషయమని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో మంత్రి కందుల దుర్గేష్‌ను డాక్టర్ సృజనా దేవి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆశీస్సులు తీసుకున్నారు. డాక్టర్ సృజనా దేవిని శాలువాతో సత్కరించిన మంత్రి దుర్గేష్, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
వైద్యురాలిగా, సామాజిక కార్యకర్తగా ఇప్పటికే సమాజంలో తనదైన ముద్ర వేసిన డాక్టర్ సృజనా దేవి.. మోడలింగ్, ఫ్యాషన్ రంగాల్లోనూ జాతీయ స్థాయిలో కిరీటం గెలుచుకోవడం అభినందనీయమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ అద్భుత విజయాలు సాధించడం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని అన్నారు. డాక్టర్ సృజనా దేవి భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన వారిలో ఏపీ ఛాంబర్స్ సలహాదారు లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ ఎం.వి. పవన్ కార్తీక్, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి తదితరులు ఉన్నారు.