తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా అవకాశాలను అందించేందుకు కాకతీయ యూనివర్సిటీ మరో కీలక ముందడుగు వేసింది. జర్మనీలోని రూట్లింగెన్ యూనివర్సిటీతో కాకతీయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నారు.
కాకతీయ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి సమక్షంలో, రిజిస్ట్రార్ వి. రామచంద్రం మరియు రూట్లింగెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బ్రూనే జోచెన్, Program Director/Vice Dean – Industrial Engineering, International Project Engineering, Knowledge Foundation, Reutlingen University, అలాగే స్టెఫాన్ డెగ్లెమాన్, Program Manager – International Programs, Knowledge Foundation, Reutlingen Universityలు అవగాహన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో జర్మనీ ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు 3+2 మాస్టర్స్ కోర్సు ద్వారా తమ ఉన్నత విద్యను జర్మనీలో కొనసాగించే అవకాశం పొందనున్నారు. ఇందులో మొదటి మూడు సంవత్సరాల విద్యను కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేసి, తదుపరి రెండేళ్ల మాస్టర్స్ విద్యను జర్మనీలోని రూట్లింగెన్ యూనివర్సిటీలో అభ్యసించవచ్చు. మొదటి మూడు సంవత్సరాల విద్యను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ, అనంతరం రూట్లింగెన్ యూనివర్సిటీ మాస్టర్స్ డిగ్రీ ప్రదానం చేస్తుంది.
కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులకు రూట్లింగెన్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఇతర విభాగాల విద్యార్థులకు మాస్టర్ ఆఫ్ డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ వంటి మాస్టర్స్ కోర్సుల్లో విద్యను కొనసాగించే అవకాశం కల్పించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా కాకతీయ యూనివర్సిటీ నుంచి 20 మంది విద్యార్థులను మెరిట్-కమ్-రిజర్వేషన్ ప్రాతిపదికన, యూనివర్సిటీ పాక్షిక సహకారంతో ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు, జర్మనీలో ఉన్నత విద్య మరియు భవిష్యత్ ఉపాధి అవకాశాలను పొందేందుకు ఈ ఒప్పందం ఎంతో దోహదపడనుంది.
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో అవగాహన ఒప్పంద పత్రాల మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ఆచార్య కుమార్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. జర్మనీలోని రూట్లింగెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బ్రూనే జోచెన్ మరియు స్టెఫాన్ డెగ్లెమాన్ ఆన్లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ OSD ఆచార్య వెంకట్రామ్ రెడ్డి, RUSA నోడల్ అధికారి ఆచార్య మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.