⏩ ఐటీ, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, నౌకానిర్మాణ రంగాల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు.
⏩యువత నైపుణ్యాలను పెంచుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలి: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
నరసరావుపేట/వినుకొండ(రైట్స్ మీడియా): యువత భవితకు భరోసా కార్యక్రమంలో భాగంగా సోమవారం నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ శాసనసభ్యులు, GDCC బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తో కలిసి వినుకొండ పట్టణంలోని సాయి డిగ్రీ కాలేజ్, రాధా డిగ్రీ కాలేజీలలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముచ్చటించారు. మహాత్మా గాంధీ ఆశయాలు, నాటి ఆలోచనలను నేటి యువతతో పంచుకున్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని, సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు.
పెట్టుబడులు.. ఉద్యోగ అవకాశాలు
రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి విద్యార్థులకు ఎంపీ వివరించారు. ఐటీ, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, నౌకానిర్మాణం తదితర రంగాల్లో ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, సంస్థలు ఏర్పడటంతో పాటు యువతకు విస్తృతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు ఇప్పటి నుంచే తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని ఎంపీ గారు సూచించారు.
పారదర్శకంగా 16,347 DSC ఉద్యోగాల భర్తీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత DSC ద్వారా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని ఎంపీ తెలిపారు. ఈ నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.
అనంతరం AI పోస్టర్ మేకింగ్ & ప్రెజెంటేషన్, పెయింటింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బహుమతులను అందజేసి అభినందించారు.