ఖమ్మం, అక్టోబర్- 30(రైట్స్ మీడియా):
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ఏదులాపురం మునిసిపాలిటీ పరిధిలోని పీవిఆర్ గార్డెన్స్ లో ఏదులాపురం మునిసిపాలిటీ లోని 176 మంది లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారి ఒక స్లాబ్ ఇళ్లలో ఉండాలనే కల, ఆశ ఏదైతే ఉందో అది నెరవేర్చాలనే తపనతో ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు ఇవ్వడం జరిగిందని,
హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో మరో లక్ష ఇళ్లు, ఇవన్నీ కలిపి ఈ రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇళ్లు 40 వేల కోట్ల రూపాయలతో కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం వంద శాతం పేదోళ్ల మనసును దోచిన, మెచ్చినదని, అర్హులైన ప్రతి పేదవాడికి కులం, మతం, పార్టీ అని చూడకుండా, పూర్తిగా పేదల సంక్షేమమే ధ్యేయంగా అమలు చేయబడుతోందని మంత్రి స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు లో మియాపూర్ కు సంబంధించి 560 ఎకరాల భూమి వివాదంలో ప్రయివేటు వ్యక్తులకు అప్పటి ప్రభుత్వం కట్టబెట్టాలని చూస్తే, అప్పుటి పార్లమెంట్ సభ్యుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో న్యాయమైన వాదనలు పెట్టి ఆ కేసు గెలిచామని తెలిపారు. ప్రతి ఆడబిడ్డకు రూ. 5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని తెలిపారు.
ప్రతిపక్షాలు ఎన్ని గావు కేకలు పెట్టినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా ప్రజా ప్రభుత్వం మళ్లీ ప్రజల దీవెనలతో అధికారంలోకి వస్తుందని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ,
ఏదులాపురం మునిసిపాలిటీ కి మొదటి విడతలో దాదాపు 467 ఇళ్లు మంజూరు కాగా, ఇందులో దాదాపు 400 వరకు ఇళ్లు నిర్మాణం పూర్తై లబ్ధదారులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. మరో 45 ఇళ్లు మాత్రమే వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయని, కొన్ని నెలల క్రితం శాంక్షన్ వచ్చిన 18 మంది లబ్ధదారులు కూడా వేగంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు.
లబ్ధదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అత్యంత పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఇండ్ల నిర్మాణం స్టేజి పూర్తి కాగానే ఫోటోలు తీసుకుని, కేవలం వారం పది రోజుల్లోనే బిల్లులు చెల్లించడం వల్ల లబ్ధదారులు ఎంతో త్వరగా ఇళ్లను నిర్మించుకోగలిగారన్నారు.
మొదటి విడత విజయవంతమైన నేపథ్యంలో, ఇప్పుడు రెండో విడత కింద 176 ఇళ్లను లబ్ధదారులకు అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ రెండో విడత ఇళ్ల నిర్మాణాలను కూడా అతి త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.