హైదరాబాద్ (రైట్స్ మీడియా): ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ నిమజ్జన ఘాట్ వద్ద ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘాట్‌కు చేరుకున్న ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని, అనంతరం నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా నిమజ్జన ఘాట్ వద్ద భద్రతా చర్యలు, నీటిలో రక్షణ చర్యలు, బోట్ల ద్వారా నిర్వహిస్తున్న పహారా తదితర అంశాలను ఆయన పరిశీలించారు.
అనంతరం ఎన్టిఆర్ (NTR) మార్గంలోని హైడ్రా (HYDRAA) కంట్రోల్ రూమ్‌కు చేరుకున్న హైడ్రా కమిషనర్ అక్కడి నుంచి గణేష్ నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షించారు. నిమజ్జన ఘాట్ల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైన చోట్ల తక్షణ చర్యలు చేపట్టేలా అధికారులకు సూచనలు చేశారు. అలాగే నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అన్ని ప్రభుత్వ శాఖలు, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ, హైడ్రా తదితర విభాగాల అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఏవీ రంగనాథ్ ఆదేశించారు.
భక్తులు, ఉత్సవ కమిటీలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోట్ల పహారా, నీటిలో రక్షణ చర్యలను కూడా కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలిస్తూ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.