బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. కళింగపట్నం సమీపంలో తీరం దాటనున్న ఈ వ్యవస్థతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా, ఉమ్మడి ఆదిలాబాద్ కు అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం బుధవారం రాత్రి నుంచి గురువారంలోగా విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు.. పలు జిల్లాల్లో ఈదురుగాలులు
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, నల్గొండ, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేస్తూ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్ కు రెడ్ అలర్ట్
శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ఐఎండీ అత్యంత తీవ్రమైన ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ తో పాటు నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో ‘ఆరెంజ్ అలర్ట్’ ఇచ్చింది. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, జనగాం, సిద్దిపేటలకు ఎల్లో హెచ్చరికలు కొనసాగుతాయి. ఇక సెప్టెంబర్ 26న ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.