ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సోమవారం సందర్భంగా అన్న పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారని ఆలయ కార్యనిర్వాహణాధికారి కందుల సుధాకర్ తెలిపారు. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసం కావడంతో ఉదయం నుండే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అర్చకులు స్వామివారికి మహా అభిషేకం, బిల్వార్చన, రుద్రాభిషేకం నిర్వహించారని ఈవో తెలిపారు .
ఐనవోలు మల్లన్న సన్నిధిలో ఘనంగా అన్న పూజా మహోత్సవం
అన్న పూజ విశిష్టత :
ఈ సందర్భంగా గర్భాలయంలో స్వామివారిని అన్నంతో అలంకరించి అన్న పూజ (అన్నాభిషేకం) చేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్న పూజ చేయడం వల్ల అన్నపానాలకు లోటు ఉండదని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. అనంతరం భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అన్న పూజను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, వేదపండితులు విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ, నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్,పాతర్లపాటి నరేష్ శర్మ, మడికొండ దేవేందర్, సాయి వరుణ్ పాల్గొన్నారు.