హైదరాబాద్ (రైట్స్ మీడియా): హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతోందని హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న గణేష్ నిమజ్జన సరళిని బేగంపేట విమానాశ్రయం నుండి ఏరియల్ వ్యూ (హెలికాప్టర్) ద్వారా ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మరియు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా పాల్గొన్నారు.
ఏరియల్ వ్యూ అనంతరం బేగంపేట విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత 11 రోజులుగా నగరంలో ఘనంగా నిర్వహించిన గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా చివరి రోజు నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్, బాలాపూర్ గణేశ్‌తో పాటు జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణేష్ విగ్రహాల నిమజ్జనం సాఫీగా జరుగుతోందని, మధ్యాహ్నం వేళకే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయిందని తెలిపారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించిన ముఖ్య అంశాలు:
హైదరాబాద్‌లో 11 రోజులుగా ఘనంగా నిర్వహించిన గణేశ్ ఉత్సవాల ముగింపు సందర్భంగా చివరి రోజు నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. ఖైరతాబాద్ బడా గణేశ్, బాలాపూర్ గణేశ్‌తో పాటు హైదరాబాద్ జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. మధ్యాహ్నం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తైంది.
నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వంలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ భక్తులకు, ఉత్సవ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం. ఈరోజు నిమజ్జన ప్రక్రియలో భాగంగా డీజీపీ, జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్ తదితర అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎయిరియల్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. పరిస్థితి ప్రశాంతంగా, నియంత్రణలో ఉంది.
ప్రస్తుతం నిమజ్జన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు సహకరించి విగ్రహాల మూమెంట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నాం. రేపు ఉదయం లేదా వీలైనంత త్వరగా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు అన్ని ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రజలందరూ భక్తిపారవశ్యంతో గణేశ్ నిమజ్జన వేడుకలను ఆనందంగా జరుపుకోవాలి. ఎలాంటి ప్రమాదాలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఎంజే మార్కెట్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో అక్కడక్కడా ట్రాఫిక్ రద్దీ ఏర్పడినప్పటికీ, వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తూ అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసే చర్యలు చేపడుతున్నాం.
నిమజ్జన ప్రక్రియ ఎప్పటిలాగే ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. నిర్వాహకులు, భక్తులు సహకరిస్తే నిమజ్జన ప్రక్రియను వీలైనంత త్వరగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం.