శుక్రవారం గీసుగొండ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ,ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులే భవిష్యత్ ప్రగతి సాధకులని, వారి అభివృద్ధే దేశ అభివృద్ధికి మూలమని వరంగల్ జిల్లా మాధ్యమిక విద్యాధికారి (డీఐఈఓ) డా. శ్రీధర్ సుమన్ అన్నారు.
గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
వికసిత్ భారత్ కు విద్యార్థులే పునాది
ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పమైన "వికసిత్ భారత్ - 2047" లక్ష్యాన్ని సాధించడంలో భావి భారత పౌరులైన విద్యార్థులదే కీలక పాత్ర అన్నారు. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. కళాశాలల్లో నిర్వహించే అంతర్గత పరీక్షలు, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సర్వతోముఖాభివృద్ధి సాధించాలని సూచించారు.
తల్లిదండ్రుల బాధ్యతను పంచుకుంటున్న ప్రభుత్వం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు, అధ్యాపకుల హాజరు మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని ఆయన వివరించారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు, షూ, యూనిఫాం వంటి అన్ని వసతులను ఉచితంగా అందజేస్తోందన్నారు. దీని ద్వారా తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని, బాధ్యతను ప్రభుత్వమే పంచుకుంటోందని తెలిపారు.
ఆటపాటలతో అలరించిన విద్యార్థులు
అనంతరం మధ్యాహ్న భోజన విరామం తర్వాత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల డ్యాన్స్, ఆట-పాటలతో సభా ప్రాంగణం మార్మోగింది. నూతనంగా చేరిన విద్యార్థులను సీనియర్లు ఘనంగా స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శోభాదేవి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.