వర్ధన్నపేట(రైట్స్ మీడియా): మండలం ఇల్లంద గ్రామంలోని ఊర చెరువు కట్ట మరమ్మతు, అభివృద్ధి పనులకు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు శనివారం శంకుస్థాపన చేశారు. రూ. 41.85 లక్షల నిధులతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టి, చెరువు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
ఇల్లంద ఊర చెరువు మరమ్మతు పనులకు శంకుస్థాపన
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ,
చెరువులు గ్రామీణ ప్రాంతాల వ్యవసాయానికి ఎంతో కీలకమని, వాటి సంరక్షణతో రైతులకు సాగునీటి అవసరాలు తీరడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు కూడా దోహదపడుతుందని తెలిపారు. చెరువు కట్ట మరమ్మతు పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. చెరువు అభివృద్ధి పనుల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా సాగునీటి కాలువల ద్వారా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, అవసరమైన సమన్వయంతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కాలువలు, ఇతర సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇల్లంద గ్రామ చెరువు కట్ట మరమ్మతు పనులు పూర్తయితే చెరువు సంరక్షణకు, సాగునీటి నిర్వహణకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోశాల వెంకన్న, మాజీ మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, ఐనవోలు దేవస్థానం చైర్మెన్ ప్రభాకర్ గౌడ్, ఇల్లంద మార్కెట్ చైర్మెన్ నరకుడు వెంకటయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పావని యకాంతం, వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు ఈగ దామోదర్, ఇల్లంద గ్రామ శాఖ అధ్యక్షులు ఎద్దు రాజేంద్రప్రసాద్, మండల బ్లాక్ అధ్యక్షరాలు సునీత గౌడ్, సీనియర్ నాయకులు సాయి కుమార్, స్వామి, బుచ్చిమల్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.