హైదరాబాద్ (రైట్స్ మీడియా): నగరంలో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంబజార్ ఛత్రి వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన విక్రమ్ (21)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పలు వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారుల వద్ద ₹500 నకిలీ నోటు ఇచ్చి వస్తువులు కొనుగోలు చేసి.. అసలు కరెన్సీ రూపంలో సుమారు ₹400 చిల్లర తీసుకునేవాడని పోలీసులు గుర్తించారు.
విక్రమ్ వద్ద నుంచి 16 నకిలీ ₹500 నోట్లు, మొత్తం ₹8,000 ముఖ విలువ కలిగిన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లను తన స్నేహితుడు అశోక్ నుంచి తీసుకున్నట్లు విక్రమ్ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అశోక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి విక్రమ్‌ను రిమాండ్‌కు తరలించారు. నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు