ఖమ్మం కలెక్టరేట్ నందు అసంఘటిత రంగ కార్మికులకు అవగాహన కల్పించే ప్రచార రథం జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, అక్టోబర్- 22(రైట్స్ మీడియా): సమాజంలో అనాదిగా కొనసాగుతున్న వెట్టి చాకిరి, బానిసత్వం వంటి దురాచారాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ పిలుపునిచ్చారు.
వెట్టి చాకిరి నిర్మూలనపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్ను గురువారం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం అసంఘటిత రంగ కార్మికులకు వెట్టి చాకిరి నిర్మూలన, కార్మిక హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ,
వెట్టి చాకిరి అనేది మానవ హక్కులకు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే అమానవీయ విధానమని, సమాజంలో ప్రతి ఒక్కరికీ గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్మికులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఎవరైనా బలవంతంగా పనులు చేయించడం, శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా పనిచేయించుకోవడం వంటి అన్యాయాలకు పాల్పడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
వెట్టి చాకిరి నిర్మూలనకు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు వెట్టి చాకిరి నిర్మూలన, కార్మికుల హక్కులు, అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలు, ఫిర్యాదుల పరిష్కార విధానాలపై అవగాహన కల్పించనున్నారు.
ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, గనులు, క్వారీలతో పాటు వెట్టిచాకిరీ చోటుచేసుకునే అవకాశం ఉన్న ఇతర పని ప్రదేశాల్లోని అసంఘటిత, ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న కార్మికరంగాలపై ఈ ప్రచారం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని, సమాజంలో వెట్టి చాకిరికి తావులేకుండా, ప్రతి కార్మికుడు స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎం. కోటేశ్వరులు, జిల్లా కార్మిక శాఖ సహాయ కమీషనర్ పి. కృష్ణవేణి, సహాయ కార్మిక అధికారి ఓ. రమేష్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) భాస్కర్, జిల్లా బాలల సంక్షేమ కమిటీ (CWC) సభ్యులు లక్ష్మయ్య, ఎఐడి ఎన్జీఓ శ్రీనివాస్, గజ్వేల్ కళాబృందానికి చెందిన వంశీ, రాధా, ప్రతాప్, వేణు, లత, సునీల్, బాబు తదితరులు పాల్గొన్నారు.