తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారంపై సభా ఫుటేజీ అంశాలపై ఎథిక్స్ కమిటీ చర్చించింది. వివరణ ఇచ్చేందుకు తనకు మరింత గడువు కావాలని కౌశిక్ రెడ్డి కమిటీని కోరారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీ మరో సారి ఇవాళ సమావేశమైంది. సభలో కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఇదివరకే..ఆయనకు కమిటీ నోటీసులు జారీ చేసింది. తాజాగా కౌశిక్ రెడ్డి సమర్పించిన వివరణ, ఆయన కోరిన అదనపు గడువు, సభా కార్యకలాపాలకు సంబంధించిన ఫుటేజీ అంశాలపై ఇవాళ్టి కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. అయితే వివరణ ఇవ్వడానికి తనకు ఆరు వారాల గడువు కావాలని కౌశిక్ రెడ్డి గతంలో కమిటీని కోరారు.
ఆ రోజు అసెంబ్లీలో జరిగిన పూర్తి కార్యకలాపాల వీడియో ఫుటేజీని కూడా అందించాలని కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అదనపు ఫుటేజీ ఇవ్వడంపై కొంత అభ్యంతరం వ్యక్తమైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించి ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫుటేజీని కమిటీ పరిశీలనకు ఉంచినట్లు సభ్యులు సూచించారు. దీంతో ఎథిక్స్ కమిటి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.