• పాత జాబితాలో పేరు ఉన్నా కొత్తగా నిర్దేశిత విధానంలో దరఖాస్తు తప్పనిసరి.
• ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
మహబూబాబాద్(రైట్స్ మీడియా): అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు.
సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరం ప్రజావాణి కార్యక్రమంలో వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పట్టభద్రులైన ఓటర్లు ఓటరుగా నమోదు చేసుకోవడంపై జిల్లాస్థాయి అధికారులు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం వెలువరించిన నియమ నిబంధనలు, దరఖాస్తు చేసే విధానం, గడువు, తదితర వివరాలను కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రజావాణి లో పాల్గొన్న అధికారులకు క్లుప్తంగా వివరించారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, అర్హులైన పట్టభద్రులు నిర్ణీత గడువులోగా ఫారం-18 దరఖాస్తులు సమర్పించేలా సహకరించాలని తెలిపారు.
01-11-2023 నాటికి కనీసం 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసి అర్హత కలిగిన అభ్యర్థులు Form-18 దరఖాస్తును AEROలకు (లేదా) నియమిత అధికారికి సమర్పించాలన్నారు.
దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, అవసరమైన ఇతర పత్రాలను జత చేయాలని సూచించారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్సైట్ https://ceotelangana.nic.in/ ను సందర్శించవచ్చని తెలిపారు.
పట్టభద్రుల ఓటరు జాబితాల నూతన తయారీ ప్రక్రియలో భాగంగా, ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు సైతం నిర్దేశిత విధానం ప్రకారం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
పాత ఓటరు జాబితాలో పేరు ఉండటం ఒక్కటే ప్రస్తుత ప్రక్రియలో నమోదుకు సరిపోదని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.