హనుమకొండ (రైట్స్ మీడియా): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన సైకిల్ ర్యాలీ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకునే సందేశాన్ని చాటింది.
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఎన్ పి డిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, ట్రై సిటీ లోని వివిధ సైక్లిస్ట్ బృందాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొని పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..
ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి సేవలను ఎప్పటికీ మరువకూడదని పేర్కొన్నారు.
అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీ వారికి అంకితమైన ఘనమైన నివాళి అని తెలిపారు. సైక్లింగ్ వంటి శారీరక వ్యాయామాలు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు సైతం ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
ముఖ్యంగా 89 సంవత్సరాల వయస్సులోనూ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న మామిడి నర్సయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
ఆయన ఉత్సాహం అందరికీ స్ఫూర్తిదాయకమని, వయస్సు అనేది వ్యాయామానికి అడ్డంకి కాదని ఈ ర్యాలీ నిరూపించిందని తెలిపారు.
వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సైకిల్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏఆర్ అదనపు డీసీపీలు వి.శ్రీనివాస్, సురేష్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ లను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, హనుమకొండ ఏసీపీ నర్సింహరావు, సీఐలు, ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది, నగరంలోని వివిధ సైక్లిస్ట్ బృందాల సభ్యులు సుమారు 200 మంది పాల్గొన్నారు.