⏩వరంగల్ అభివృద్ధిపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతర పోరాటం: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
⏩ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
⏩ఓటు చోరీపై కాంగ్రెస్ పోరాటం ఇప్పటితో ఆగదు.. రాహుల్‌గాంధీ రెండున్నరేళ్లుగా ఓటు హక్కు కోసం పోరాడుతున్నారు:వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హనుమకొండ(రైట్స్ మీడియా): AICC ఆదేశాల మేరకు, కేంద్ర ఎన్నికల సంఘంలో SIR లో జరిగిన "ఓటు చోరీ" అక్రమాలకు వ్యతిరేకంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులకు పాల్పడిన సిఈసి జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య భారీ ర్యాలీతో హనుమకొండ కలెక్టరేట్ వరకు తరలివచ్చారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ..
ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. ‘ఓటు చోరీ’పై కాంగ్రెస్ పోరాటం ఇప్పటితో ఆగదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం కొనసాగుతుందని అన్నారు. బీజేపీ రాజకీయంగా వరంగల్‌లో అడుగుపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ కార్యకర్తలు సమష్టిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిల్లి పిల్లల్లా బయటకు వచ్చి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నవారిని అడ్డుకుందాం’’ అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నారని ఎంపీ డా.కడియం కావ్య పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా, ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తుతోందని చెప్పారు.
గతంలో వరంగల్ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదని ఎంపీ విమర్శించారు. మామునూరు విమానాశ్రయం, ఓఆర్ఆర్, కోచ్ ఫ్యాక్టరీ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం పోరాడుతోందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి వరంగల్ అభివృద్ధి అంశాలను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.
ఓటు హక్కు, రాజ్యాంగం, అంబేడ్కర్ ఆశయాలు, పిల్లల భవిష్యత్తును కాపాడటమే కాంగ్రెస్ పోరాటమని ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, అణగారిన వర్గాల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. మతం, కులం పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
2029లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చూడాలంటే ఇప్పటి నుంచే కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎంపీ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘‘ఇది మొదటి రోజే.. మన పోరాటం ఇలాగే కొనసాగుతుంది’’ అంటూ కడియం కావ్య స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్, మండల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, ఆర్జీపీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి, యువజన విభాగాల ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.