కాకతీయ యూనివర్సిటీలో టీ–హబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆంత్రప్రెన్యూర్‌షిప్ అవగాహన కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. యూనివర్సిటీ సెనెట్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాపార దృక్పథం, స్టార్టప్‌ల ఏర్పాటు, సంస్థ స్థాపన, ఆంత్రప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు వినూత్న ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా మలచడం, స్టార్టప్‌ను ప్రారంభించడం, కంపెనీని ఏర్పాటు చేయడం వంటి అంశాలను వివరించారు. వ్యాపార ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడంలో మార్కెట్ అవసరాలను గుర్తించడం, వినియోగదారుల సమస్యలను అర్థం చేసుకోవడం, వాటికి పరిష్కారం చూపే ఉత్పత్తులు లేదా సేవలను అభివృద్ధి చేయడం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు. అలాగే కంపెనీ స్థాపన ప్రక్రియ, సంస్థల రిజిస్ట్రేషన్, బృంద నిర్మాణం, వ్యాపార నమూనా (Business Model), పెట్టుబడుల సమీకరణ తదితర అంశాలపై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. టీ–హబ్ ప్రతినిధి శ్రీ బిందు మాధవ్ ఇవటూరి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటంతో పాటు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని సూచించారు. వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను సమర్థంగా వినియోగించుకుని స్టార్టప్‌ల స్థాపన దిశగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల్లో ఆంత్రప్రెన్యూర్‌షిప్ సంస్కృతిని పెంపొందించడం, స్టార్టప్‌ల స్థాపనకు అవసరమైన మార్గదర్శకత్వం, శిక్షణ, పరిశ్రమల అనుసంధానం, మెంటార్షిప్ అవకాశాలను కల్పించేందుకు టీ–హబ్ సహకారం అందించనుందని కేయూ కే–హబ్ డైరెక్టర్ ఆచార్య టి. సవితా జ్యోత్స్న తెలిపారు. రుసా నోడల్ అధికారి ఆచార్య ఆర్. మల్లికార్జున రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, మొత్తం ఇట్లాంటి 17 సెషన్ లు నిర్వహిస్తునట్టు, వీటిలో ఇప్పటివరకు 5 సెషన్ లు నిర్వహించినట్టు, సమయ సరళి ప్రకారం ఇంకా 12 సెషన్ లు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కే–హబ్ జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ సిద్ధార్థ, డాక్టర్ బొల్లం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.