ఘట్కేసర్–కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల రైల్వే మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టుకు ₹2,419 కోట్లతో ఆమోదం తెలిపినందుకు మాజీ ఎంపీ, బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షులు డా. బూర నర్సయ్య గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్–కాజీపేట కీలక రైల్వే కారిడార్‌లో రైల్వే సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు నాలుగు లైన్ల సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టును సుమారు 2029–30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు మేడ్చల్–మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్ జిల్లాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని డా. నర్సయ్య గౌడ్ తెలిపారు.
“తెలంగాణకు ఇంతటి కీలకమైన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టును మంజూరు చేసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఘట్కేసర్–కాజీపేట రైల్వే మార్గం తెలంగాణలో అత్యంత కీలకమైన రవాణా మార్గాల్లో ఒకటి. దీని సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ప్రయాణికులు, సరుకు రవాణా వేగవంతమై రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది,” అని డా. గౌడ్ అన్నారు. అదనపు రైల్వే ట్రాక్‌ల ద్వారా రైళ్ల రద్దీ, ఆలస్యాలు తగ్గడంతో పాటు మరిన్ని ప్రయాణికుల మరియు సరుకు రవాణా రైళ్లను నడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. హైదరాబాద్–భువనగిరి–యాదాద్రి–జనగామ–వరంగల్ మధ్య రవాణా అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని, అదేవిధంగా యాదాద్రి–భువనగిరి పర్యాటక అభివృద్ధికి, వరంగల్‌తో పాటు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. కాజీపేట మీదుగా తూర్పు, మధ్య భారతదేశం వైపు సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. భవిష్యత్తులో సబర్బన్, రీజినల్ రైలు సేవలను విస్తరించేందుకు కూడా ఈ పెరిగిన రైల్వే సామర్థ్యం ఉపయోగపడుతుందని డా. నర్సయ్య గౌడ్ తెలిపారు.
“తెలంగాణలో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, వికసిత్ భారత్ నిర్మాణానికి అవసరమైన కనెక్టివిటీని పెంచడంలో మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. తెలంగాణకు ఈ చారిత్రాత్మక పెట్టుబడిని మంజూరు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రివర్గానికి మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.