ఏబీసీ కేంద్రంలో కుక్కల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వేగవంతం చేయాలి:జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్న
జీడబ్ల్యూఎంసీ, అక్టోబర్ 29(రైట్స్ మీడియా): నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టడంతోపాటు, వీధి కుక్కల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను వేగవంతం చేయాలని, ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో అగ్నిమాపక భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ. వెంకన్న అధికారులను ఆదేశించారు.
గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, హసన్పర్తిలోని జంతు జనన నియంత్రణ కేంద్రం పనితీరు, ములుగు రోడ్డులోని రినోవా ఆసుపత్రి, కిట్స్ కళాశాలలో విద్యాభవనంలో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఒకటో డివిజన్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్, స్థానిక గృహవాసులతో నేరుగా మాట్లాడి స్వచ్ఛ ఆటోలు ప్రతిరోజూ వస్తున్నాయా, ఇంటింటి నుంచి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతోందా అని అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి స్వచ్ఛ ఆటోలకు అందించాలని ప్రజలకు సూచించారు. రోడ్లపై ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షించాలని, పారిశుద్ధ్య పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సంబంధిత జవాన్లను ఆదేశించారు.
హసన్పర్తిలోని ఏబీసీ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్, వీధి కుక్కలకు నిర్వహిస్తున్న కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల ప్రక్రియను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న శస్త్రచికిత్సల సంఖ్యను మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్రం నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్రం పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం ములుగు రోడ్డులోని రినోవా ఆసుపత్రి, కిట్స్ కళాశాలలో నూతనంగా నిర్మించిన విద్యాభవనాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిమాపక భద్రతా పరికరాలు, ఇతర రక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. నిర్దేశిత భద్రతా ప్రమాణాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లోపాలు గుర్తిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కమిషనర్ వెంట సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఏఎఫ్ఓ రాజేశ్వర్రావు, పారిశుద్ధ్య విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.